wrapper

Beaking News

Thursday, 17 October 2019 00:00

మేఘా ఐటీ తనిఖీల్లో ఏమి బయటపడిందంటే…

మేఘా ఇంజనీరింగ్ సంస్థపై హైదరాబాద్లోనూ, ఢిల్లీలోనూ, ఆ సంస్థ యాజమాన్యానికి చెందినవారి ఇళ్లలోనూ ఐటీ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో ఏం బయటపడ్డాయనేది ఆసక్తికరంగా మారింది. వేల కోట్ల రూపాయలు అక్రమ మార్గంగా దారి మళ్లాయని, వందల కోట్ల రూపాయలు, కిలోల కొద్ది బంగారం పట్టుకున్నారని వెలుగు లాంటి చిన్న పత్రికలతో పాటు వీ6 ఛానెల్, రవిప్రకాశ్కు చెందిన సోషల్ మీడియాలో ఊదరగొడుతోంది. కానీ ప్రధాన వార్తపత్రికలు, టీవీ ఛానెల్లో ఈ అంశాన్ని అసలు పట్టించుకోవడం లేదు. అదే సమయంలో ఇక్కడి ఐటీ అధికారులు ఇంతవరకూ అధికారికంగా గానీ, అనధికారికంగా గానీ ఏమీ చెప్పనేలేదు. భవిష్యత్తులోనైనా చెబుతారో లేదో తెలీదు. దాంతో ఆ సంస్థ యాజమాన్యంపై కోపం ఉన్నవారు, కక్షపెంచుకున్నవారు, తగాదాలు ఉన్నవారు సోషల్ మీడియాల్లో మరీ ముఖ్యంగా వాట్సప్, ఫేస్బుక్, ట్విట్టర్లో విస్తృతంగా చెడు ప్రచారం చేస్తున్నారు. టీఆర్ఎస్, టిడిపి, కాంగ్రెస్ లక్ష్యంగానే కేంద్రంలోని బీజెపి ప్రభుత్వం ఐటీ తనిఖీలు చేయించిందని ప్రచారం కూడా జరుగుతోంది. అయితే ఐటీ, ఈడి, సీబీఐ తనిఖీలు, కేసులు అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ కనుసన్నల్లోనే జరుగుతుంటాయి. గతంలో రాజకీయాలకు అతీతంగా జరిగేవి. కానీ ఇప్పుడు పూర్తిగా రాజకీయంగా మారిపోయాయి. తమకు నచ్చనివారిని కేంద్ర ప్రభుత్వం వేధిస్తున్న దాఖలాలు ఉన్నాయి. ఉదాహరణకు ఎంపీ (మాజీ మంత్రి) సుజనా చౌదరి తెలుగుదేశం నుంచి బీజెపిలోకి చేరగానే ఆయనపైన ఉన్న ఐటీ, సీబిఐ, ఈడి కేసులన్నీ మూలన పెట్టారు. దీనిని బట్టి కేంద్రం పక్షపాతంగా వ్యవహరిస్తోందని స్పష్టమవుతోంది. ఇంత జరుగుతున్నా ఈ అంశం మీడియాలోగాని, ప్రజల్లోగానీ అసలు ఏమాత్రం చర్చనీయాంశంగా లేదు. మొత్తం అందరూ ఆర్టీసీ సమ్మె, హుజుర్నగర్ ఉప ఎన్నికలు తదితర అంశాలపైనే దృష్టి కేంద్రీకరించారు. నిజానికి ఐటీ అధికారులు నిర్వహించిన సోదాల్లో వందలకోట్ల రూపాయల నగదు, కిలో కొద్ది బంగారం దొరికి ఉంటే వాటిని ఐటీ అధికారులు వెంటనే తెలియజేస్తారు. ఈ విషయం మీడియాకు తెలియంది కాదు. అందువల్లనే ప్రధాన మీడియా ఈ అంశాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదట. ఐటీ సంస్థ డబ్బున్న వారి ఇళ్లలోనూ, కంపెనీల్లోనూ తనిఖీలు నిర్వహించడం మామూలే. ఆ విధంగా జరిగినప్పుడు అక్రమ ఆస్తు ఉన్నట్లు తెలితే నిబంధనల ప్రకారం నోటీసులు ఇచ్చి సమాధానాలు, ఆధారాలు సంతృప్తిగా లేకపోతే పన్ను విధించడంతో పాటు ఫైన్ కూడా వేస్తారు. అంతేగానీ ఐటీ కేసుల్లో అరెస్టులు ఉండవు. రవిప్రకాశ్ మీడియా అయితే అరెస్టుకు రంగం సిద్ధం అని పెద్ద స్టోరీనే వేసింది. ఐటీ శాఖ తనిఖీలు, సోదాలు చేసినంత మాత్రాన తనిఖీకి గురైనవారు తప్పుచేసినట్లు కాదు, నేరస్థులో, దేశ ద్రోహులో అంతకన్నా కాదు. పన్ను సక్రమంగా చెల్లిస్తున్నారా లేదా, ఆస్తుల మదింపు సరిగా ఉందా లేదా అనేదే దీని ఉద్దేశ్యం. ఇక మేఘాపై తనిఖీలు, సోదాలకు వస్తే కొందరు ఐటీ అధికారుల సమాచారం ప్రకారం విలువైన బంగారు ఆభరణాలు, నగదు ఏదీ కూడా కార్యాలయాల్లోగానీ, ఇళ్లలోగానీ, బ్యాంకు లాకర్లలోగానీ లభించలేదు. దొరికిన బంగారు నగలు కూడా అధికారికంగా పన్ను చెల్లించి కొనుగోలు చేసినట్లు ఆధారాలు అధికారులకు లభించాయట. ఇక నగదు విషయానికి వస్తే 32 వేల కోట్లు చేతులు మారినట్లు ఓ మీడియా సంస్థ విస్తృతంగా ప్రచారం చేసింది. ఇది వింటే భయం, ఆశ్చర్యం వేస్తుంది. కానీ వాస్తవం తెలుసుకుంటే విస్తుపోతాం. అసలు ఆ సంస్థ వ్యాపారమే 22 వేల కోట్లని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఇందులో దాపరికం లేదు. దానిపై పన్ను చెల్లించగా లాభం చివరకు 2వేల కోట్లని తేలిందట. ఇది వాస్తవమైతే 32వేల కోట్లు ఎలా చేతులు మారతాయో! మీడియా తీరు ఇశ్చర్యంగా లేదు. ఇక మొత్తం వ్యాపారానికి సంబంధించి దేశంలోనూ, వివిధ దేశాల్లోనూ ఎక్కడెక్కడ ఏఏ ప్రాజెక్టులు చేస్తున్నారు? వాటి ద్వారా బిల్లుల చెల్లింపు ఎలా ఉంది? తద్వారా వచ్చిన ఆదాయం లాభాలతో ఏ విధమైన ఆర్థిక లావాదేవీలు చేస్తున్నారో తదితర వ్యవహారాలను క్షుణ్ణంగా తనిఖీచేయడానికి ఐటీ అధికారులు రికార్డులు తీసుకెళ్ళారు. వాటన్నింటిని పరిశీలిస్తేగానీ పద్దతి ప్రకారం పన్ను చెల్లించారా? లేదా? మనీలాండరింగ్ జరిగిందా అనేది తేలాల్సి ఉంది. ఇందుకు కొంత సమయం పడుతుంది. అయితే మేఘా ఇంజనీరింగ్ అన్ని ప్రధాన సంస్థల్లాగానే ముందుగా (అడ్వాన్స్ టాక్స్) పన్ను చెల్లిస్తుంది. సరాసరిన 1500 కోట్లు చెల్లిస్తోందని ఐటీ రికార్డులు చెబుతున్నాయి. ఇప్పుడు తనిఖీల్లో బయటపడిన లావాదేవీల్లో అంతకు మించి పన్నులు చెల్లించాల్సి వస్తే అపరాద రుసుంతో సహా వసూలు చేస్తారు. రహస్యంగా ఏవైనా ఉంటే అవి కూడా 3500 కోట్లు దాటిన తరువాత (ఐటీ భాషలో మ్యాట్ క్రెడిట్ అంటారు) లావాదేవీలు ఉంటే తీవ్రంగానే పరిగణిస్తారు. ఇవన్నీ తేలడానికి సమయం పడుతుంది. కానీ ఈలోగా సంచలనాల కోసం వేల కోట్ల రూపాయలు అక్రమం అంటూ, వాటి వెనుక రాజకీయ పెద్దలు అంటూ ప్రచారం సాగిస్తున్నారు.
Read 64 times