wrapper

Beaking News

Tuesday, 05 November 2019 00:00

ఇసుక తుఫాను వెనుక ....

ఇసుక తుఫాను ఏపి ప్రభుత్వాన్ని చుట్టుముట్టింది. తీవ్రమైన ఇసుక కొరత వల్ల భవన కార్మికులకు ఉపాధి అవకాశాలు సన్నగిల్లడంతో రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది గత మూడు నెలలుగా పనిలేక ఇబ్బంది పడుతున్నారు. నిర్మాణ రంగంలో ముఖ్యంగా భవన కార్మికుల్లో ఉపాధి అవకాశాలు కనుమరుగు కావడంతో పాటు ఆ కుటుంబాలకు చెందిన కొందరు ఆత్మహత్యలు చేసుకుంటుండడంతో మొత్తం వ్యవహారం రాజకీయ వివాదంగా మారిపోయింది. ప్రభుత్వం వైఫల్యం వల్లనే ఈ సమస్య తలెత్తిందని ప్రతిపక్షాలు ముఖ్యంగా తెలుగుదేశం, జనసేన మీడియా బాట పట్టాయి. అదే సమయంలో బీజెపి, వామపక్షాలు సైతం అందుకు వంతపాడుతున్నాయి. సమస్య తీవ్రంగానే ఉంది. అయితే అందుకు కారణం ప్రభుత్వ వైఫల్యమా? ప్రభుత్వంలోని పెద్దలు నిర్లక్ష్యం చేయడం వల్ల సమస్య తీవ్ర రూపం దాల్చిందా? భవన కార్మికులు ఉపాధి అవకాశాలు కోల్పోయి వీధిన పడడానికి ప్రభుత్వమే కారణమా? ఈ రంగంలోని కొందరు ఆత్మహత్యలు చేసుకోవడానికి కూడా ప్రభుత్వ వైఫల్యమే కారణామా? ఇసుక మాఫియాను అరికట్టి ప్రజలకు సులభంగా ఇసుకను అందుబాటులోకి తేవాలని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి చేసిన ప్రయత్నం వికటించి చివరకు రాజకీయంగా ప్రభుత్వానికి సమస్య, సవాలుగా మారిందా? అక్రమాలను అదుపు చేసి ప్రజలకు తక్కువ ధరకు లభించే విధానం తీసుకురావాలనే ప్రయత్నం ఆచరణలో జాప్యం కావడంతో పాటు అందుకు ఊహించని విధంగా మూడు నెలల పాటు వరదలు ప్రధాన నదుల్లో కొనసాగడంతో అసలు ఇసుకే లభించని పరిస్థితి తలెత్తి మొత్తం ప్రభుత్వం ఇసుక సమస్యలో కూరుకుపోయిందా? చిత్తశుద్ధి, నిజాయితీతో ప్రజలకు మేలు చేయాలనే ప్రయత్నం ఓవైపు అధికారులు, మంత్రుల నిర్లిప్తిత మరోవైపు ప్రకృతి సహకరించకపోవడం కలిసి చివరకు రాజకీయ సమస్యగా మారాయి. ఈ ఇసుక తుఫాను సుడిగుండంలో ప్రభుత్వం ఇరుక్కుంటుందా? లేక టీ కప్పులో తుఫానులాగా సద్దుమణుగుతుందా?. *తెలుగుదేశం ప్రభుత్వంలో ఇసుక మాఫియా* వాస్తవానికి గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఇసుక విక్రయాల్లో పెద్దఎత్తున అక్రమాలు జరిగాయి. అధికార తెలుగుదేశం పార్టీ నాయకులు ఇసుక వ్యాపారులుగా అవతారం ఎత్తారు. కొందరైతే మాఫియా తరహాలో అక్రమ సంపాదనకే ప్రాధాన్యత ఇచ్చారు. టన్ను ఇసుక వేల రూపాయల ధర పలికింది. అప్పట్లో ప్రభుత్వం ఆన్లైన్ ద్వారా విక్రయాలు, ఉచితంగా ఇసుక అంటూ విధానాలు ప్రకటించినప్పటికీ ప్రజలకు అందింది శూన్యం. ఇసుకాసురులుగా నాటి తెలుగుదేశం నేతలు కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించారు. ఈ పరిస్థితి నుంచి బయటపడడానికి వైసీపీ అధికారంలోకి రాగానే ఇసుక విక్రయాలను పూర్తిగా నిషేదించింది. ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా, తక్కువ ధరకు లభించేలాగా నాయకులు, అధికారుల ప్రమేయం నామ మాత్రం చేసే పద్ధతిలో కొత్త విధానం అమలులోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి నిర్ణయించారు. అందులో భాగంగా ఇసుక రీచ్ల నుంచి క్రయ విక్రయాలు నిలిపివేశారు. అయితే అందుకు ప్రత్యామ్నాయ విధానాన్ని రూపొందించాలని నిర్ణయించగా అందులో జాప్యం జరగడంతో పాటు ఆ తర్వాత వరదలు రావడంతో ఇసుక లభించని పరిస్థితి నెకొంది. కొత్త ప్రభుత్వం అధికారంలోకి రాగానే కొత్త ఇసుక పాలసీ అంటూ జాప్యం. ముందుగా సెప్టెంబర్ నుంచి కొత్త పాలసీ అని తర్వాత అక్టోబర్కు మార్చడంతో ఇసుక రీచ్లు కాళీగా ఉన్న సమయంలో పాలసీ రెడీగా లేదని తవ్వకాలకు నో చెప్పిన సర్కార్ తీరా పాలసీ రెడీ అయ్యే సరికి నదుల్లో పెరిగిన ప్రవాహాలు, వరదలు. వరదలు తగ్గుముఖం పడితే ప్రభుత్వం ఇసుక తీయడానికి అన్ని ఏర్పాట్లు చేసింది. *ఇసుక ప్రస్తుత పరిస్థితి* 267 ఇసుక రీచులలో 207 రీచులు (దాదాపు 80 శాతం) భారీ వరదల కారణంగా నీటిలో మునిగి ఉన్నాయి. కేవలం 60 రీచుల నుండి మాత్రమే ఇసుక దొరుకుతోంది. గత 15 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా కృష్ణా నదిలో 70 రోజులుగా, గోదావరిలో 40 రోజులుగా భారీ వరద కొనసాగుతుంది. వాగులు, వంకలు నదులు ఉప్పొంగి 4200 TMC ల నీళ్లు సముద్రంలో కలిసాయి.గత ప్రభుత్వ హయాంలో కరువు, వానలు లేవు కాబట్టి ఇసుక ఎప్పుడు కావాలంటే అప్పుడు దొరికేది. *అక్రమ రవాణాపై చర్యలు…..* రాష్ట్రంలో ఇసుక అక్రమ రవాణాపై ప్రభుత్వం కొరడా ఝుళిపిస్తోంది. రాష్ట్రంలో నూతన ఇసుక పాలసీ ద్వారా పారదర్శకంగా వినియోగదారులకు ఇసుకను అందించాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని కొందరు ఆన్ లైన్ మోసం ద్వారా పక్కదోవ పట్టించేందుకు ప్రయత్నించారు. ఆన్లైన్ లో బల్క్ బుకింగ్ లలో పలువురు బ్రోకర్లు వేర్వేరు అడ్రస్ లతో ఇసును బుక్ చేస్తూ.. ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ రకంగా నకిలీ ఐడిలతో ఇసుకను బుకింగ్ చేస్తున్నారంటూ వచ్చిన ఫిర్యాదులపై ప్రభుత్వం దృష్టిసారించింది. దీనిపై పోలీస్, మైనింగ్ అధికారులు జరిపిన విచారణలో గుంటూరు కేంద్రంగా కిషోర్ అనే వ్యక్తి ఆన్లైన్ లో ఇసుక అక్రమాలకు పాల్పడుతున్నట్లు వెల్లడయ్యింది. సుమారు 1.27 లక్షల రూపాయల విలువైన ఇసుకను కిషోర్ నకిలీ ఐడిలతో బుక్ చేసినట్లు గుర్తించారు. కిషోర్ అక్రమంగా తరలించేందుకు సిద్దం చేసిన 27 టన్నుల ఇసుకను, 7 ట్రాక్టర్ లను మైనింగ్ అధికారులు సీజ్ చేశారు. అలాగే గన్నవరంకు చెందిన దుర్గారావు అనే వ్యక్తిని కూడా గుర్తించారు. బినామీ పేర్లతో 3.80 లక్షల రూపాయల విలువైన ఇసుకను దుర్గారావు ఆన్లైన్ లో బుక్ చేశారు. మీసేవ ఆపరేటర్ గా పనిచేస్తున్న దుర్గారావు బ్రోకర్లతో కుమ్మకై ఈ మేరకు మోసానికి పాల్పడినట్లు అధికారులు నిర్ధారించారు. దీనిపై కిషోర్, దుర్గారావులపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ఆన్లైన్ ద్వారా వస్తున్న దరఖాస్తులకు సంబంధించి ఐపిలను గుర్తించడం ద్వారా ఇటువంటి మోసాలకు చెక్ పెట్టేందుకు అధికారులు సిద్దమయ్యారు. రాష్ట్రంలో ఇసుక కొరత కారణంగా భవన నిర్మాణ కార్మికుల ఉపాధి దెబ్బతినకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర పంచాయతీరాజ్, గనుల శాఖామంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. రాష్ట్రంలోని కృష్ణా , గోదావరినదుల్లో వరద కొనసాగుతోందని, దీనివల్ల ప్రధానమైన రీచ్ ల నుంచి ఇసుకను అందించలేక పోతున్నామని తెలిపారు. రాష్ట్రంలో నూతన ఇసుక పాలసీ ప్రకటించిన తరువాత ప్రారంభంలో అయిదు వేల టన్నుల ఇసుకను అందించగా, నేడు దానిని నలబై అయిదు వేల టన్నుల మేరకు పెంచగలిగామని తెలిపారు. గత పదేళ్లలోని వర్షాభావ పరిస్థితులకు భిన్నంగా ఈ ఏడాది సంవృద్దిగా వర్షాలు కురుస్తున్నాయని తెలిపారు. దీనివల్ల కృష్ణానదిలో డెబ్బై రోజులుగా, గోదావరిలో నలబై రోజులుగా వరద కొనసాగుతోందని అన్నారు. ఈ పరిస్థితుల్లో ఇసుక కొరత ఉత్పన్నమైందని, దీనిని అధిగమించేందుకు ప్రత్యామ్నాయ ఇసుక రీచ్లను గుర్తిస్తున్నామని అన్నారు. భవిష్యత్తులో ఇసుకకు కొరత లేదు... తాజా వరదల కారణంగా నదుల్లో దాదాపు పది కోట్ల టన్నుల ఇసుక మేట వేసిందని మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. సాధారణంగా రాష్ట్రంలో ఏటా రెండు కోట్ల టన్నుల ఇసుక మాత్రమే వినియోగిస్తున్నారని అన్నారు. అంటే మరో అయిదేళ్లకు సరిపడ్డ ఇసుక నిల్వలు రాష్ట్రంలో వున్నాయని తెలిపారు. ఇప్పటికే 1295 మంది బల్క్ కన్స్యూమర్ లకు అయిదు లక్షల టన్నుల ఇసుకను అందించామని తెలిపారు. మరో పదిహేను రోజుల్లో వరదలు కూడా తగ్గుముఖం పడతాయని భావిస్తున్నామని, ఇసుక రీచ్ ల నుంచి వరదనీరు తగ్గగానే కావాల్సినంత ఇసుకను వినియోగదారులకు అందచేస్తామని వెల్లడించారు. ఇప్పటివరకు 1.70 లక్షల టన్నుల ఇసుకను సరఫరా చేయడం జరిగిందని వెల్లడించారు. ఇసుక కావలసినవారు sand.ap.gov.in ద్వారా నమోదు చేసుకోవాలని కోరారు.
Read 58 times